News Ticker

మంత్రి పదవి కోసం జగన్ కు జైలు.. అన్నాడు

చంద్రబాబు జపాన్ పర్యటనకు వెళ్లక ముందు రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ అనే అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలు గడుస్తున్న తరుణంలో ఇప్పటికీ ఆయా శాఖలపై పట్టు సాధించలేకపోయిన కొంతమందిని మంత్రి వర్గం నుంచి తప్పించనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

కొంతమంది మంత్రుల మీద చంద్రబాబు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అలా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్న మంత్రుల జాబితాలో హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప కూడా ఉన్నారని టాక్. మరి ఈయనకు ఉద్వాసన తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈయన బదులు అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి పదవి లభిస్తుందని.. ఈయన ను తప్పించడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో చిన్నరాజప్ప వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. తన  పనితీరుపై అసంతృప్తితో ఉన్న బాబును సంతృప్తి పరిచే పనిలో ఉన్నారట ఈయన. ఈ నేపథ్యంలో. పరిటాల హత్య కేసును తిరగదోడతాం అని ఒక ప్రకటన… జగన్ తిరిగి జైలుకు వెళ్లక తప్పదు.. అని మరో ప్రకటన చేశాడు మంత్రిగారు!

ఇంకేముంది… శాఖ పరమైన పనితీరు విషయంలో చంద్రబాబు రాజప్పపై ఏమైనా అసంతృప్తితో ఉన్నా.. ఈ మాటలతో ఆల్ ఈజ్ వెల్ అయినట్టేనని చెప్పవచ్చు! ఒకవైపు ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తూ… రైతుల వ్యవహారంలో వ్యవహరిస్తున్న తీరుతో.. ఎక్కడ వ్యతిరేకత ప్రబలుతోందో అని భయంతో ఉన్న పార్టీ శ్రేణులను రాజప్ప అలా ఉత్సాహ పరిచాడు.

“జగన్ కు జైలు” అనే మాట వింటే తెలుగుదేశం శ్రేణులు తిరిగి ఉత్సహపూరితమవుతాయి. మరి ఈ మధ్య ఈ మాట ఎవరూ మాట్లాడలేదు. దీంతో ఈ బాధ్యతను రాజప్ప స్వీకరించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాడు. మరి ఇక రాజప్ప పనితీరుపై బాబు కూడా సంతృప్తి పడిపోయినట్టేనేమో! ఈయన మంత్రి పదవికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదేమో!

Leave a comment

Your email address will not be published.

*