కందిరీగ

సినిమా : కందిరీగ
రేటింగ్ : 3.25/5
నటీనటులు : రామ్, హన్సిక మొత్వాని, అక్ష, సోనూసూద్, జయప్రకాష్ రెడ్డి, చంద్రమోహన్, సన, శ్రీనివాసరెడ్డి, ఎం.ఎస్. నారాయణ, రఘుబాబు, బ్రహ్మానందం, స్వాతి తదితరులు
కెమెరా : ఆండ్రూ
సంగీతం : థమన్
నిర్మాత : బెల్లంకొండ సురేస్, బెల్లకొండ గణేష్‌బాబు
సమర్పణ : మల్టీ డైమన్షన్స్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్
విడుదల : ఆగష్టు 12, 2011 - శుక్రవారం
పాయింట్ : తనను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిల్లో తాను ప్రేమించిన అమ్మాయిని ఏవిధంగా దక్కించుకున్నాడనేది కథ.
'కందిరీగ' కుడితే ఎంత బాధ కల్గుతుందో... ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే ఇండస్ట్రీకి ఆ బాధేంటో తెలిసింది. కానీ రిలీజ్ తర్వాత దాన్నంతా మర్చిపోయేలా చేసింది నిర్మాతకు. అంటే తెలుగు, తమిళ టెక్నీషియన్స్ గొడవ చిలికి చిలికి గాలివానలా తెలుగు ఇండస్ట్రీనీ, అటు తమిళ ఇండస్ట్రీని కుదిపేసింది. ఫలితంగా తెలుగు పరిశ్రమ సమ్మెకు దిగింది. ఆ తర్వాత కొంత పరిష్కారం అయినా మళ్ళీ సమ్మె జరగడం, ఇలా రెండు మూడుసార్లు షూటింగ్ వాయిదాపడుతూ.. అనుకున్న టైమ్‌కంటే.. ఎక్కువ సమయం పట్టడం, ఖర్చు పెరగడం జరిగింది.
ఇంత జరిగినా తన సినిమాపై నమ్మకంతోనో ఏమోగానీ.. ఈ చిత్రం విడుదల తర్వాత సక్సెస్ ఊహించని విధంగా ఉంటుందని తెలిసిన నిర్మాత బెల్లంకొండ సురేష్ కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో అమ్మకాలు జరిగినా వారి దగ్గర నుంచి ఎక్కువ ధరకు తిరిగి తీసుకున్న ఘనత ఆయనకే దక్కింది. ఇదేదో పిచ్చితనంగా అనిపించినా సినిమా విడుదల తర్వాత ఎటువంటి ప్రేక్షకుడైనా చూసి మెచ్చుకునేలా దర్శకుడు బాగా తీర్చిదిద్దాడు.
ఈమధ్య ఏ కుర్ర హీరో సినిమా చూసినా.. అందులోనూ రామ్ చిత్రాలు పరిశీలిస్తే... పెళ్లయిన లేక పెళ్ళికాబోతున్న అమ్మాయిని కిడ్నాప్ చేయడంతో ఆరంభమవుతుంది. సరిగ్గా కందిరీగలో కూడా శ్రీను (రామ్) తనుండే అనకాపల్లిలో పెళ్ళి జరుగుతున్న ఓ అమ్మాయిని తనింటికి తీసుకువస్తాడు. ఎందుకంటే.. తనకు పెళ్లీడు వయస్సు వచ్చినా తల్లిదండ్రులు చంద్రమోహన్, సనలు పెండ్లి చేయకపోవడంతో శీను ఇచ్చిన ట్విస్ట్ అది. దీన్నిబట్టి శీను డేరింగ్ క్యారెక్టర్ అనీ, తన తెలివితేటలతో ఎంతటివాడినైనా బుట్టలో వేసేస్తాడనీ దర్శకుడు చెప్పాడు.

ఈ తెలివితేటలను చూసి స్వంత మామయ్య ధర్మవరపు తన కుమార్తె స్వాతినిచ్చి పెండ్లి చేయాలనుకుంటాడు. కానీ నిశ్చితార్థం రోజు కనీసం డిగ్రీ కూడా చదవని వాడిని డిగ్రీ చదివిన నేను చేసుకోనని స్వాతి ఛీకొడుతుంది. దీంతో పట్టుదల పెరిగి సిటీకి వచ్చి కాలేజీ చేరతాడు రామ్. అక్కడ శృతి(హన్సిక)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆల్‌రెడీ లోకల్ గూండా భవాని(సోనూసూద్) ఆమెను తన ప్రాపర్టీగా భావించేస్తూ... చదువు అయ్యాక పెండ్లి చేసుకోవాలని చూస్తాడు.
అందుకే ఆమెపై ఎవరి దృష్టి పడకుండా కొంతమందిని నియమిస్తాడు. అయితే శీను విషయం తెలిసి వార్నింగ్ ఇవ్వడమే కాక.. ఆవేశంలో... శృతి తనకు తానుగా ప్రేమిస్తే నీకిచ్చి పెండ్లి చేస్తానని శీనుతో చెబుతాడు భవాని. దీన్ని సవాల్‌గా తీసుకుని శృతిని ప్రేమించేలా చేస్తాడు. కానీ నిజాన్ని జీర్ణించుకోలేని భవాని.. శీనును లేపేయాలని చూస్తాడు. అదే టైమ్‌లో శృతిని తెలంగాణాకు చెందిన మరో గూండా రాజన్న (జయప్రకాష్‌రెడ్డి) అనుచరులు కిడ్నాప్ చేస్తారు. శృతిని వెతుక్కుంటూ రాజన్న ఇంటికి వచ్చిన శీనుకు తన కుమార్తె సంధ్య(అక్ష)నిచ్చి పెండ్లిచేస్తానని ట్విస్ట్ ఇస్తాడు. అప్పటివరకు శృతి ఇక్కడే ఉంటుందంటాడు.
ఈ గొడవ నుంచి బయటపడటానికి ఓకే అని చెప్పి 10రోజుల్లో పెళ్లి ఏర్పాటు చేయమని శీను సూచిస్తాడు. ఎలాగూ శీను పెండ్లి జరుగుతుందని తెలుసుకుని శృతిని తీసుకుపోదామని భవాని రాజన్న ఇంటికి వస్తాడు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. భవానిని సంధ్య ప్రేమించేలా శీను మైండ్‌గేమ్‌తో మార్చేస్తాడు. మరోవైపు మైసమ్మ అనే మరో గూండా వచ్చి శృతిని, సంధ్యను కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? శ్రీనును సంధ్య పెండ్లి చేసుకుందా..? శృతి చేసుకుందా..? అసలు సంధ్యకు శీనుకు పరిచయం ఎలా జరిగింది..? అనేది చూడాలంటే సినిమా చూడాల్సిందే.
బేసిగ్గా ఈ కథ చూస్తుంటే... రెడీ, ఢీ చిత్రాల మిళితంగా కన్పిస్తుంది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మొదటిసారి దర్శకత్వం వహించి స్క్రీన్‌ప్లేలో చాలా కేర్ తీసుకుని ఇంట్రస్ట్‌గా మలిచాడు. నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా కథాగమనాన్ని మలచడంలో కృతకృత్యుడయ్యాడు. ఆండ్రూ సినిమాటోగ్రఫీ, సంగీతం, సంభాషణలు అన్నీ వినడానికి బాగున్నాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్తపడ్డాడు.
రామ్ పెర్‌ఫార్మెన్స్ తనదైన స్టైల్‌లో ఎనర్జిటిక్‌గా, కామెడీని, డాన్స్‌ను, ఫైట్స్‌ను బాగా చేశాడు. కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. హన్సిక పాత్ర సాదాసీదాగా ఉన్నా ఫర్వాలేదు. అయితే బాడీపై తగిన శ్రద్ధ పెట్టకపోవడంతో లావుగా కన్పించి కొన్నిచోట్ల నమితను చూసినట్లుంది. సినిమాలో ప్రధానపాత్ర అక్ష. సెకండాఫ్‌లో ఆమె పాత్ర కీలకం. కథంతా ఆమె చుట్టూ తిరుగుతుంది. అమాయకత్వం, ఫ్యాక్షన్ కుటుంబంలో లవ్ చేసుకుని పెండ్లి చేసుకోవాలనే గోల్‌ను ఆమె తీర్చుకోవాలన్న తపన గల క్యారెక్టర్‌కు బాగా సూటయింది.
ఇక సోనూసూద్ పాత్ర మరో కీలకం. విలనిజాన్ని కామెడీ జోడిస్తూ ఏక్‌నిరంజన్ తర్వాత సోనూసూద్ చేసిన పాత్ర ఇది. కరడుగట్టిన విలన్‌నూ ప్రేమ పేరుతో హాస్యాన్ని పండించే విధంగా దర్శకుడు తీసుకున్న శ్రద్ధ బాగుంది. చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డి, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు పాత్రలు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఇన్నాళ్ళు స్ట్రెయిక్‌లు, ఫ్లాప్‌లతో తెలుగు సినిమా సతమతమవుతున్న సమయంలో కందిరీగ కాస్త రిలీఫ్‌నిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, సరైన సంభాషణలు రాసుకోవడంలో దర్శకుడు రచయితలు తీసుకున్న శ్రద్ధ కన్పిస్తుంది. వి.వి.వినాయక్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ బాగానే ఉంది. తొలి దర్శకుడైనా తననుకుంది సాధించాలంటే ఏం చేయాలో అన్నీ చేసి మెప్పించాడు. ఈ దర్శకుడిపై నమ్మకంతో బెల్లంకొండ సురేష్ మరో సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో హాయిగా సరదాగా కాలక్షేపం చేయదగ్గ సినిమా కందిరీగ..
More Telugu Cinema Reviews: | |
|