News Ticker

అప్పుడు వైఎస్ పై రెచ్చిపోయారు కదా..!

మన తెలుగు మీడియాకు ప్రకృతి అంటే ఎంతో ప్రేమ… భూమిపై మనుషులకు ఎంత హక్కు ఉందో.. పక్షులు, జంతువులకు, క్రిమి కీటకాలకు కూడా అంతే వాటా ఉంటుందని మన ఘనత వహించిన మీడియాలోని జర్నలిస్టులు చెబుతారు. వార్త కథనాల్లో కూడా ఇలాంటి మానవతా వాదాలను, ప్రాణిధర్మాలను రంగరించి కథనాలు రాస్తారు. అయితే అది అవసరమైన వేళల్లో మాత్రమే. మీడియాధినేతలకు ప్రభుత్వ వ్యవహారాలు నచ్చనప్పుడు వారి లోని జీవకారుణ్య మూర్తులు నిద్రలేస్తారు.

ఉదాహరణకు వెనుకటికి వైఎస్సార్ హయాంలో జమ్మలమడుగు ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని భావించారు. అందుకు సంబంధించి ప్రభుత్వం భూ సేకరణకు సిద్ధం అయ్యింది. ఇంకే ముంది.. తెలుగు మీడియా రెచ్చిపోయింది. ఉన్నవి లేనివి రాస్తూ.. జమ్మలమడుగులో స్లీల్ ప్లాంట్ పెట్టాలని భావించడం ఎంత పాపమో వివరించింది. అది ఒక చక్కటి అటవీ ప్రాంతం అని… పచ్చని చెట్లతో, పరుగులెత్తే లేళ్లు కుందేళ్లలతో అహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంటుందని.. మరి అలాంటి చోట ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పెట్టాలని భావిస్తోందని… తద్వారా ప్రకృతికి ఎంతో ద్రోహం చేస్తోందని… పచ్చదనం జాడ లేకుండా చేస్తోందని మీడియా ఆందోళన వ్యక్తం చేసింది.

ఆ తర్వాత ఆ పత్రికల కథనాలను వైఎస్ఆర్ అసెంబ్లీలో చదివి వినిపించారు. తను ఆ ప్రాంతంలో పుట్టి పెరిగన వాడినేనని… ఆ ఏరియాలో తాము ఏ రోజూ కనీసం కుందేలు పిల్లలను కూడా చూడలేదని.. అంటూ ఆ మీడియా కథనాలను ఏకిపారేశాడు. ఆ పత్రికలు తమకు వ్యతిరేకంగా రాయడమే పనిగా పెట్టుకొన్నాయని… అర్థం పర్థం లేదని అబద్ధాలను రాస్తూ తమకు చెడ్డపేరును తీసుకురావడమే పనిగా పెట్టుకొన్నాయని వైఎస్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాడు.

కట్ చేస్తే… కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం నిజంగానే పచ్చని ప్రకృతిని కబలించాలని చూస్తోంది. పంట భూముల్లో రాజధానిని నిర్మించాలని భావిస్తోంది. వేల ఎకరాలను నిర్వీర్యం చేయడానికి సిద్ధం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ కు అన్నపూర్ణగా పేరు తెచ్చి పెట్టిన భూముల్లో కాంక్రీట్ స్ట్రక్చర్స్ ను పాతుతానంటోంది. అసలకు రాజధాని నిర్మాణం జరుగుతుందా.. అది ఎప్పటికి పూర్తవుతుందనేవి తర్వాతి సమస్యలు. ఏకంగా ముప్పైవేల నుంచి లక్ష ఎకరాల భూమిని వ్యవసాయానికి పనికిరాకుండా చేయబోతున్నారనేది మాత్రం వాస్తవం.

ఒక్క ఎకరం భూమి పాడుబోతోనే… ఎంత వెలితిగా ఉంటుందో.. వ్యవసాయం చేసేవారికి తెలుసు. అన్నదాతకు తెలుసు. అలాంటిది ఏకంగా ముప్పైవేల ఎకరాల పంట భూములను అభివృద్ధి పేరుతో నాశనం చేయబోతున్నారంటే… ఎన్ని వేల అన్నదాతల గుండెలు నలిగిపోతాయో … కేవలం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికే అర్థం అవుతుంది.

మరి ఇప్పుడు మన పత్రికలకు ఇదేమీ పట్లదు. చినుకు జాడ లేని చోట… నేల నెర్రెలు విడిచిన చోట ఒక పరిశ్రమ పెట్టబోతే… కనీసం నీటి చుక్క లేని చోట లేళ్లూ, కుందేళ్లు కనిపిస్తాయనే కథలు రాశారు. టన్నుల కొద్దీ ధాన్యాన్ని పండించేంత శక్తిని ఉన్న భూమిని పనికిరాకుండా చేస్తుంటే మాత్రం మారు మాట్లాడటం లేదు. మరి ఇప్పుడు ఈ విశృంఖలానికి తెగబడుతున్నది తమ వారు కదా! ఇంకా ఈ మీడియాను విశ్వసిస్తున్న వారు ఉంటే వాళ్లకు హ్యాట్సాఫ్!

Leave a comment

Your email address will not be published.

*